
‘తైక్వాండో’ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుడు
మోపాల్: ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో బిగ్ ఫైటర్స్ తైక్వాండో హబ్ క్రీడాకారుడు కుమ్మరి మోక్షిత్ సత్తా చాటినట్లు మాస్టర్ నరహరి నాయక్ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి నాయక్ మాట్లాడుతూ మోక్షిత్ అద్భుతమైన ప్రతిభ కనబర్చాడన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. మోక్షిత్ విజయం సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.
వేల్పూర్: వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రా మాభివృద్ధి కమిటీని రద్దు చేసినట్లు వీడీసీ అధ్యక్షుడు గుమ్ముల కిషన్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, క్యాషియర్ లింబాద్రి, సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీడీసీని రద్దు చేసినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై సంజీవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇక నుంచి గ్రామంలో వీడీసీ ఉండదని వారు పేర్కొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు సోమవారం ముగియగా, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలలో మొత్తం 30 మందికి 28 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. తెయూ క్యాంపస్ కళాశాలలో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 28 మందికి 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.
నిజామాబాద్‌నాగారం: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నీరడి లక్ష్మణ్ నియమితులయ్యారు. సోమవారం కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కె విజయ్‌కుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లాలో హ్యుమన్ రైట్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
డ్రంకెన్‌డ్రైవ్ కేసులో
రెండు రోజుల జైలు
భిక్కనూరు: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రానికి చెందిన స్వామి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో స్వామిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

‘తైక్వాండో’ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుడు