
అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం
● పీసీసీ చీఫ్ ఇంటి ముట్టడికి యత్నం
● సీఐటీయూ నాయకుల
ముందస్తు గృహనిర్బంధాలు
● ధర్నాచౌక్ వద్ద అంగన్‌వాడీల నిరసన
నిజామాబాద్‌నాగారం: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతోపాటు సీఐటీయూ నాయకులు సోమవారం నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చలో హైదరాబాద్‌కు వెళ్లనున్న అంగన్‌వాడీ టీచర్లు, నాయకులను ఉదయం పోలీసులు గృహనిర్భంధం చేశారు. పలువురిని పోలీసు స్టేషన్లకు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇంటి ముట్టడికి అంగన్‌వాడీ కార్యకర్తలు యత్నించారు. సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. కార్యకర్తలు, నాయకులను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం మిగతా అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం, అక్రమ నిర్భందాలు చేయడం సరికాదని అన్నారు. సమస్యల పరిష్కారంపైన చూపాల్సిన శ్రద్ధ నాయకుల అరెస్టులపై పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రీ ప్రైమరీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు స్వర్ణ, చంద్రకళ, మంగాదేవి, వాణి, విజయ, లక్ష్మి, వసంత, సూర్యకళ, రాజ్యలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.