
ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
● ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం
సలహాదారులు వేం నరేందర్ రెడ్డి
● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి విసృత్త ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ముఖ్య అతిథితోపాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, సీటింగ్ తదితర వాటిపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
17న స్వస్థనారీ స్వశక్తి పరివార్ ప్రారంభం
మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వస్థనారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మహిళల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో సాధారణ ఆరోగ్య శిబిరాలు, ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 10 చోట్ల నిర్వహిస్తారని తెలిపారు. శిబిరాల్లో గైనకాలజీ, చర్మవ్యాధి, దంత, కంటి, మానసిక, పిల్లల వైద్య నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ, రక్తదాన శిబిరాలు ఉంటాయని తెలిపారు. డీఆర్డీవో, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించి ప్రత్యేక పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.