
గ్రావిటీతో నీటి సరఫరా..
నిజామాబాద్ సిటీ: పంపింగ్ వ్యవస్థతో పనిలే కుండా మంచిప్ప చెరువు నుంచి గ్రావిటీ ద్వారా 1892లోనే నీటిని సరఫరా చేశారు నాటి ఇంజినీర్లు. నిజాం కాలం నాటి ఇంజినీర్ల అద్భుత ప్ర తిభకు నిదర్శనం మంచిప్ప లార్జ్ ట్యాంక్.
మంచిప్ప చెరువునీటితో ఇందూరువాసుల దాహార్తిని తీర్చేందుకు నాటి నిజాం నవాబు కృషి చేశారు. 1892 ప్రాంతంలో మంచిప్ప చెరువు నుంచి నీటిని ఎలాంటి పంపింగ్ వ్యవస్థ లేకుండా కేవలం గ్రావిటీద్వారా నీటిని కంజర–కులాస్‌పూర్ వరకు తీసుకువచ్చారు. కులాస్‌పూర్ వద్ద ఫిల్డర్ బెడ్‌లో నీటిని శుద్ధి చేసి పైపుల ద్వారా నిజామాబాద్ నగరంలోని పెద్ద బజార్‌లో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌లోకి వస్తాయి. ఇక్కడి నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నీటిని సరఫ రా చేస్తున్నారు. 440 మీటర్ల ఎత్తులో ఉన్న మంచిప్ప చెరువులోని నీటిని దిగువన 380 మీటర్ల వరకు కులాస్‌పుర్ ఫిల్టర్‌బిడ్ వరకు నీరు గ్రావిటీ ద్వారా సరఫరా అవుతున్నాయి. ఎలాంటి టె క్నాలజీ ఉపయోగించకుండా కేవలం భూమార్గంలోనే కాల్వల ద్వారా (గ్రావిటీ) చెరువు నీటిని తరలించారు. ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. పైపుల మరమ్మతులు వంటి చిన్నచిన్న సమస్యలు మినహా మిగతా పెద్దగా ఎలాంటి సమస్యలు లేవు. సుమారు వందేళ్లుగా ఇందూరువాసులు తమ గొంతులు తడుపుకుంటున్నారు.