
వరదపోటును తట్టుకున్న పోచారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో నాగిరెడ్డిపేట మండలం పోచారం శివారులో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917లో పోచారం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1922లో నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో రూ. 27.11 లక్షల వ్యయంతో ప్రాజెక్టు నిర్మించారు. ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 21 అడుగుల ఎత్తు, 1.7 కిలోమీటర్ల పొడవు తో ఆనకట్టను నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో రాళ్లు, డంగు సున్నం మాత్రమే వినియోగించారు. మొదట 3.4 టీఎంసిల నీటినిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలని తలచినప్పటికీ ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. 70 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే శక్తి ఉన్న పోచారం ప్రాజెక్టులోకి గత నెల 27, 28 తేదీల్లో ఎవరూ ఊహించని రీతిలో 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అయినా ప్రాజెక్టు స్ట్రక్చర్ బలంగా ఉండడంతో దెబ్బతినలేదు.