
చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పథకంలో చోరీ
● ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్, ఆయిల్
ఎత్తుకెళ్లిన దుండగులు
● ఏడాదిలో మూడోసారి ఘటన
నందిపేట్(ఆర్మూర్): జిల్లాలో ఎత్తిపోతల పథకాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దుండగులు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. పోలీసులు నమోదు చేస్తున్నా ఇప్పటి వరకు దుండగులను పట్టుకున్న దాఖలాలు లేవు. తాజాగా చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పథకం పరిధిలోని ఉమ్మెడ శివారులో ఉన్న రెండవ పంపుహౌజ్ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్లతో లిఫ్ట్ గదిలోకి ప్రవేశించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సాకలి ముత్తెన్న, సాకలి శ్రీను అనే ఇద్దరు ఆపరేటర్లను బెదిరించి కాపలా కాశారు. అనంతరం దుండగులు 250 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగుల గొట్టి రాగి కాయిల్స్, ఆయిల్‌ను దొంగిలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
కొలిక్కి రాని దర్యాప్తు..
ఈ సంవత్సరంలో చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పంపుహౌజ్‌ల వద్ద మూడు సార్లు, తల్వేద ఎత్తిపోతల పఽథకంలో మూడు సార్లు చోరీలు జరిగాయి. దుండగులు ఎత్తిపోతల పథకాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రూ. లక్షల విలువైన రాగి కాయిల్స్, ఇంధనం, ఇతర పరికరాలను అపహరించుకుపోతున్నారు. వరుస ఘటనలు ఒకే తరహాలో జరుగుతున్నప్పటికీ చోరీలకు పాల్పడుతున్నది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఒక్క కేసు కూడ దర్యాప్తు కొలిక్కి రాలేదు. ఎత్తిపోతల పథకాల ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయక పోవడంతో వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాల వద్ద చోరీల నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.