
చోరీ కేసులో ఇద్దరు మహిళా నిందితుల అరెస్టు
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలోని రాములు ఇంట్లో గత నెల 24న జరిగిన చోరీ కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి బస్టాండ్ వద్ద శనివారం అనుమానాస్పదంగా ఉన్న బోధన్‌కు చెందిన సంగీత, రుద్రూర్ మండలం అంబం(ఆర్)కు చెందిన సునీతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు రాములు ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్‌కు పంపించినట్టు తెలిపారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలకేంద్రంలో ఓ వ్యాపారి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి, సుమారు రూ.8లక్షల వరకు కాజేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన కొడిప్యాక శ్రీనివాస్ గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు, వసతి గృహాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసే టెండర్‌ను దక్కించుకుని, సరుకులను సరఫరా చేస్తుంటాడు. ఈక్రమంలో గత నెల 30న తన ఖాతాలో సరుకులకు సంబంధించి డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ నెల 6న తన ఫోన్ తరచూ వేడి కావడంతో ఇట్టి విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఫోన్ హ్యాక్ అయిందని, వెంటనే సిమ్‌ను వేరే ఫోన్‌లో వేసుకోమని చెప్పడంతో అతడు అలానే చేశారు. మరుసటి రోజు తన ఖాతా నుంచి డబ్బులను తీసుకుందామని కామారెడ్డిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు వెళ్లగా గతంలోనే రూ.4లక్షల 50వేలు, రూ.4లక్షల 27వేలు ఎలాంటి మెసేజ్ లేకుండా డ్రా అయినట్లు చూపించింది. దీంతో ఇదేమిటని బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా ఇది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని చెప్పారు. సదరు వ్యాపారి ఈ నెల 9న సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యాపారి తెలిపారు.