
చేపలు చేజారుతున్నాయి..
జాలి గేట్లను బిగించాలి..
● వరద గేట్ల నుంచి నీటి ప్రవాహంతోకొట్టుకుపోతున్న వైనం
● ఎస్సారెస్పీలో ప్రతియేటా ఇదే పరిస్థితి
● ఆవేదన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి విడుదల చేసినప్పుడు వరదతోపాటు చేపలు కూడా కొట్టుకు పోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ వరద గేట్ల దిగువన కేవలం గురువారం ఒక్క రోజు వేటాడితే ఎక్కువ సంఖ్యలో చేపలు చిక్కడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. అలాంటిది వరద ప్రవహించినప్పుడు ఎన్ని చేపలు కొట్టుకుపోయింటాయోనని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వదిలే వరద కాలువ ద్వారా కూడ అధికంగా చేపలు వెళ్లిపోతున్నాయి. దీంతో వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న 6 గేట్లకు జాలిగేట్లను అమర్చాలని ఏళ్లుగా మత్స్యకారులు పాలకులు, అధికారుల చుట్టు తిరుగుతున్నారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్‌లో 62 లక్షల చేపపిల్లలను ఉచితంగా వదులుతారు. కానీ చివరిలో వేటాడుటకు చేపలు ఉండవు. కారణం వరదల వలన దిగువకు కొట్టుకు పోవడమే. దీంతో వరద గేట్లకు చేపలు కొట్టుకుపోకుండ జాలి గేట్లు బిగించాలని కొన్నాళ్లుగా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ అధికారులను వివరణ కోరగా.. వరద గేట్లకు జాలిలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని వివరించారు. వరద కాలువ గేట్లకు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.
వరద గేట్లకు, వరద కాలువ గేట్లకు జాలి గేట్లను నిర్మించాలి. జాలి గేట్లు లేకపోవడంతో కిందకి చేపలు కొట్టుకుపోతున్నాయి. చిన్న, పెద్ద చేపలు తేడా లేకుండ పోతున్నాయి. ప్రభుత్వం ఆలోచించి, మత్స్యకారుల సమస్యను పరిష్కరించాలి.
– శ్రీనివాస్, మత్స్యకారుడు, బాల్కొండ