
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
బోధన్ టౌన్ (బోధన్): ట్రాక్టర్ బోల్తాపడటంతో జీపీ కార్మికులు బాలాజీ, యాదు మృతిచెందడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బంధువులు, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు విద్యుత్ కాంట్రాక్టర్ నష్టపరిహారము చెల్లించాలని, ప్రభు త్వం మృతిచెందిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రెండు ఎకరాల పొలం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యత తీసుకోవాలన్నారు. సమాచారం అందుకున్న బోధన్ తహసీల్దార్ విఠల్, డీఎల్‌పీవో, రూరల్ సీఐ విజయ్‌బాబు వారిని సముదాయించారు. అనంతరం సబ్‌కలెక్టర్ వికాస్‌మహతో వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలకు బోధన్‌లో ప్లాట్లు ఇస్తామని, కు టుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని కల్పిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు నరేందర్, సుధాకర్, మల్లేష్, నూర్జహాన్, శంకర్ గౌడ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.