
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
● కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
● రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
ఆర్మూర్/నిజామాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, డెయిరీ, ఫిషరీష్, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. జిల్లా లో శుక్రవారం పర్యటించిన ఆయన నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ఆర్మూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడా రు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయాలు, విద్య, ఉ ద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈనెల 15న భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కామారెడ్డి సభ రెండు, మూడు రోజులు వాయిదా పడుతుందని, ఆ తర్వాత సభ నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నివర్గాలను కలుపుకుపోతూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ అంటే మక్కువ పెరిగిందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. యూరియా కోసం గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రా సినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో యూరియా సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీహరిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.123 కోట్లు కేటాయించిందన్నారు. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో 82 కోట్ల చేపపిల్లలు, 24 కోట్ల రొయ్యలను పెంచుతామన్నారు.
సమావేశాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, వ్యవసాయ కమిటీ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ముప్ప గంగారెడ్డి, సాయిబాబాగౌడ్, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, నగేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.