
కేరళ సంస్కృతికి ప్రతీక ‘ఓనం’
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● తిరుమల నర్సింగ్ కళాశాలలో
ఘనంగా ఓనం వేడుకలు
డిచ్‌పల్లి: కేరళ మలయాళీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయానికి ‘ఓనం’ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ కళాశాలలో గురువారం ‘ఓనం’ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. కేరళ రాష్ట్ర యువతీ, యువకులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. కేరళ వాయిద్య పరికరాలను వాయిస్తూ విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఒక డాక్టర్‌నే అని నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న మీకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కరోనా సమయంలో తిరుమల మెడికల్ ఇన్‌స్ట్యూట్స్ చైర్మన్ పరమేశ్వర్‌రెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలకు వైద్య సేవలందించారని ప్రశంసించారు. కరస్పాండెంట్ పద్మావతి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రతిభ, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, కంచెట్టి గంగాధర్, సీహెచ్ నర్సయ్య, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, వాసుబాబు, ధర్మాగౌడ్, రాంచందర్‌గౌడ్ పాల్గొన్నారు.

కేరళ సంస్కృతికి ప్రతీక ‘ఓనం’