
వేతన వెతలు తీరేదెన్నడు?
మోర్తాడ్(బాల్కొండ): మిషన్ భగీరథ పథకం కింద పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రాకపోవడంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. సకాలంలో వేతనాలను చెల్లించకుండా ఏజెన్సీ నిర్వాహకులు మొండికేయడంతో లైన్‌మెన్‌లు, సూపర్‌వైజర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 600మంది ఉద్యోగులు..
మిషన్ భగీరథ పథకం కింద ఏర్పాటు చేసిన పంప్‌హౌజ్‌లు, సంప్‌హౌజ్‌లు ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా నీటి సరఫరాను మాత్రం ఏజెన్సీలకు గత ప్రభుత్వం అప్పగించింది. సదరు ఏజెన్సీలు లైన్‌మెన్‌లను, సూపర్‌వైజర్లను నియమించుకుని వారి ద్వారా నీటి సరఫరా నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని జలాల్‌పూర్‌లో ప్రధాన పంప్‌హౌజ్ ఉండగా ఇక్కడి నుంచి మన జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాకు నీటి సరఫరా కొనసాగుతుంది. రెండు జిల్లాల ఏజెన్సీ పరిధిలో 600 మంది వరకు ఉద్యోగులు వివిధ హోదాలలో పని చేస్తున్నారు. లైన్‌మెన్‌లకు వారి సీనియారిటీ ప్రకారం రూ.8వేల నుంచి రూ.10వేల వరకూ వేతనం ఇస్తుండగా, సూపర్‌వైజర్లకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ఏజెన్సీలకు వారు పొందిన టెండర్ ప్రకారం బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏజెన్సీలు మాత్రం తమ పరిధిలో పని చేసే సిబ్బందికి వేతనాలను ప్రతి నెలా చెల్లిస్తూ పీఎఫ్‌ను జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఐదు నెలలుగా ఏజెన్సీ నిర్వాహకులు తమ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలను చెల్లించడం లేదు. అలాగే 2022 సంవత్సరానికి సంబంధించి మరో రెండు నెలల వేతనం ఏజెన్సీ ఉద్యోగులకు బకాయి ఉంది.
ఆందోళనలు నిర్వహించినా..
మిషన్ భగీరథ పథకం కింద పని చేస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించక అవస్థలు పెడుతున్నారని నిరసిస్తూ గతంలో అనేక మార్లు ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఒక దశలో నీటి సరఫరాను నిలపివేసినప్పటికీ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం తమ తీరు మార్చుకోలేదు. మార్చిలో పంప్‌హౌజ్‌ల ముందు ధర్నా నిర్వహించగా అప్పట్లో బకాయి ఉన్న వేతనం చెల్లించారు. మళ్లీ అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఐదు నెలల వేతనం నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులు స్పందించి తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు.
మిషన్ భగీరథ సిబ్బందికి
ఐదు నెలలుగా జీతాలు కరువు
పట్టించుకోని ఏజెన్సీ నిర్వాహకులు
వేతనాలు చెల్లించాలని సూచించాం..
ఏజెన్సీలు సకాలంలోనే కిందిస్థాయి ఉద్యోగులకు వేతనాలను చెల్లించాలని సూచించాం. ఫిబ్రవరి నెల వేతనం విడుదలైంది. మిగిలిన నెలలకు సంబంధించి వేతనాలను తొందరలోనే చెల్లించనున్నారు. ఏజెన్సీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– అమీర్‌ఖాన్, డిప్యూటీ ఇంజినీర్, మిషన్ భగీరథ

వేతన వెతలు తీరేదెన్నడు?