
ప్రైవేటు దోపిడీ
డెంగీ బూచీ..
నిజామాబాద్ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా పీడితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కాగా, డెంగీ ఫీవర్‌ను నిర్ధారించే ఎలీసా టెస్ట్ కేవలం వైద్యారోగ్యశాఖ పరిధిలోని టీ–హబ్‌లోనే ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే డెంగీ అనుమానిత లక్షణాలు గల రోగి రక్త నమూనాలను టీ–హబ్‌కే పంపించాలనే నిబంధన ఉంది. వీరే సదరు రోగికి ఉన్నది డెంగీ ఫీవర్ అవునో? కాదో? నిర్ధారిస్తారు. కానీ, వీటన్నింటిని బేఖాతరు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల వారే స్వయంగా ర్యాపిడ్ టెస్టులు చేస్తూ చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని సుమారు 250, బోధన్ డివిజన్‌లో 30, ఆర్మూర్ డివిజన్‌లోని 40 వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ ఫీవర్ ట్రీట్‌మెంట్ జరుగుతోంది. జూన్, జూలై నెలలో సుమారు 200 వరకు డెంగీ ర్యాపిడ్ టెస్ట్‌లు చేసి పాజిటీవ్ అంటూ చికిత్స చేసినట్లు సమాచారం.
వేలల్లో ఫీజులు..
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు వర్షాకాలంలో డెంగీ ఫీవర్ కాసుల పంటగా మారింది. జ్వరంతో రోగి వస్తే మొదట అడ్మిషన్ ఫీజుతోపాటు సీబీపీ, డెంగీ, మలేరియా తదితర రకాల పేర్లతో సుమారు రూ. 6 వేల ఖర్చుతో టెస్టులు చేస్తారు. ఆ తర్వాతా మూడు నుంచి నాలుగు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ అయితే తగ్గిపోతుందని చెప్తారు. నిత్యం ఉదయం, సాయంత్రం టెస్ట్‌లు చేస్తూ అదనంగా రూ. 2 వేల నుంచి 4 వేలకు వసూలు చేస్తారు. రోగికి రక్త కణాలు (ప్లేట్‌లెట్స్) తక్కువ ఉంటే అదనంగా రూ. 1000 వరకు బిల్లు వేస్తారు. ఒక్క రోజుకు వాడే మందులకు రూ. 4వేలకు పైనే ఖర్చు అవుతోంది. వైద్యుల ఫీజు, రూమ్‌ల ఫీజు అదనం. ఇలా ఒక్కో రోగి నాలుగు రోజులుండి డిశ్చార్జి అయితే రూ. 40 వేలకు పైనే ఫీజు, వారం రోజులు ఉంటే రూ. 60 వేలకు పైనే ఖర్చవుతోంది. ఇక మల్టీ, సూపర్ స్పెషాలిటీల పేరిట ఉన్న ఆస్పత్రుల ఫీజులు మరింత ఎక్కువగా ఉంటాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంతంత మాత్రమే..
పల్లెలు, తండాల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జిల్లాలోని జీజీహెచ్‌లో రోజుకు 50, ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలో 10, బోధన్ జిల్లా ఆస్పత్రిలో 15 మంది వైరల్ ఫీవర్ తో చికిత్స పొందుతున్నారు. మిగతా సీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్‌లల్లో మాత్రం ఒకరు లేదా ఇద్దరు చొప్పున రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. కాగా, నిత్యం ఒక్కో ప్రైవేటు ఆస్పత్రిలో పదుల సంఖ్యలో రోగులు చేరడం గమనార్హం. అందుకు గ్రామాల్లోని పీఎంపీ, ఆర్‌ఎంపీల సహకారం ఉంటోంది. ఇదంతా తెలిసినా వైద్యశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తేనే చర్యలు తీసుకుంటామనే ధోరణిలో ఉన్నారు.
డెంగీ ఫీవర్ పేరిట కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రోగులను దోచేస్తున్నాయి. సాధారణ జ్వరంతో ఆస్పత్రిలో అడుగు పెట్టినా.. ఏవేవో వైద్య పరీక్షలు చేస్తూ రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ర్యాపిడ్ టెస్టుతోనే డెంగీ ఫీవర్‌గా నిర్ధారిస్తూ ఒక్కో రోగి నుంచి వేలల్లో వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ‘డెంగీ’ తంతు తెలిసినా సంబంధిత వైద్యశాఖ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జ్వరంతో వస్తే అడ్మిట్
ర్యాపిడ్ టెస్ట్‌తోనే పాజిటీవ్ అంటూ చికిత్స చేస్తున్న వైనం
ఒక్కో రోగికి రూ. 40 వేల నుంచి రూ.80 వేలకు పైగా ఖర్చు
ప్రైవేటు ఆస్పత్రుల్లో బాదుడు షురూ
కొరవడిన వైద్యశాఖ పర్యవేక్షణ
తనిఖీలకు ఆదేశాలు..
ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏం జరుగుతుందో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని చెప్పాం. ఎక్కడైనా రోగులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంది. డెంగీ విషయంలో మరింత సీరియస్‌గా తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. – రాజశ్రీ, జిల్లా వైద్యాధికారి

ప్రైవేటు దోపిడీ

ప్రైవేటు దోపిడీ