
పాముల బస్తీలో వ్యక్తిగత మరుగుదొడ్లు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని పాములబస్తీలో సామూహిక మరుగుదొడ్ల కూల్చివేతపై ఈ నెల 21న ‘సాక్షి’లో ‘కూల్చిందెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి నగర పాలక సంస్థ అధికారులు, నుడా చైర్మన్ స్పందించారు. మంగళవారం ఉదయం నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ డీఈ రషీద్, పంచాయతీరాజ్ ఏఈలు మురళీమోహన్, నరేశ్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పాముల బస్తీని సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సామూహిక మరుగుదొడ్లను వెంటనే నిర్మించాలని మున్సిపల్ అధికారులకు నుడా చైర్మన్ సూచించారు.
శాశ్వత పరిష్కారం దిశగా..
పాముల బస్తీలో సుమారు 300 మంది వరకు నివసిస్తుంటారు. సుమారు 25 వరకు ఇళ్లు ఉండగా, అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉన్నాయి. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు అన్మదమ్ముల కుటుంబాలు ఉంటాయి. వీరికి స్వచ్ఛ భారత్ పథకం ద్వారా మాజీ మేయర్ ఆకుల సుజాత హయాంలో నాలుగు సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. అప్పటి నుంచి ఈ మరుగుదొడ్లను కాలనీవాసులు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఈ మరుగుదొడ్లను కూల్చివేయడంతో ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా నిర్మాణమవుతున్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థకు మద్దతుగా మున్సిపల్ అధికారులే సామూహిక మరుగుదొడ్లను కూల్చివేసినట్లు కాలనీ వాసులు ఆరోపించారు. సామూహిక మరుగు దొడ్ల కూల్చివేత తర్వాత మొబైల్ మరుగుదొడ్ల వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన నుడా చైర్మన్ కేశవేణు, మున్సిపల్ అధికారులు కాలనీని సందర్శించి మరుగు దొడ్లులేని 13 ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేందుకు నిర్ణయించారు. అందుకోసం ఎస్‌జీఎఫ్ ద్వారా రూ. 5 లక్షలు, ఇతర నిధుల నుంచి మరో రూ. 5 లక్షలు కేటాయించి పనులు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. బుధవారం మరుగుదొడ్లకు ముగ్గుపోసి, రెండ్రోజుల్లో పనులు చేపట్టానున్నామని తెలిపారు.
రెండ్రోజుల్లో పనులు ప్రారంభం
నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు
కేటాయింపు
కాలనీలో పర్యటించిన నుడా చైర్మన్,
మున్సిపల్ అధికారులు
సామూహిక మరుగుదొడ్ల కూల్చివేతపై చర్యలెప్పుడో?
చర్యలతోనే రక్షణ!
స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లను కూల్చివేసిన అంశంపై ఉన్నత అధికారులు స్పందించలేదు. కూల్చిన వారిపై చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సంబంధిత మున్సిపల్ ఉన్నతాధి కారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

పాముల బస్తీలో వ్యక్తిగత మరుగుదొడ్లు