
ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నిజామాబాద్ సిటీ: ఐక్య పోరాటాలతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, భవిష్యత్‌కు బాటలు వేసేందుకు మహాసభలు దోహదపడుతాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో సీపీఐ 22వ జిల్లా మహాసభలను శనివారం నిర్వహించగా వెంకట్‌రెడ్డితోపాటు పశ్య పద్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని పార్టీలకు తల్లి పార్టీలు ఉన్నట్లు కమ్యూనిష్టు పార్టీలకు సీపీఐ తల్లివంటిదన్నారు. దేశంలో బలమైన పార్టీ సీపీఐ అని, దేశ స్వాతంత్యం కోసం పోరాడిన ఏకై న పార్టీ అని అన్నారు. యంత్రాలు లేని సమాజం కావాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని, దోపిడీకి గురయ్యే వర్గానికి వెన్ను దన్నుగా గత 76 ఏళ్లుగా పేద ప్రజల కోసం పోరాడుతున్నామన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తోందని, కార్మిక, పేద వర్గాల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రశ్నించినవారి గొంతునొక్కుతూ, అక్రమకేసులు బనాయించి జైళ్లలో వేస్తున్నారన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను చంపుతున్నారని, వెంటనే ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని డిమాండ్ చేశారు. కేవలం అటవీసంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులను చంపగలరు కానీ సిద్ధాంతాన్ని చంపగలరా అని ప్రశ్నించారు. బీజేపీ – ఎన్డీఏ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సభలో నాయకులు ఓమయ్య, సుధాకర్, వేల్పూర్ భూమయ్య, సిర్ప లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి
విరుద్ధంగా మోదీ పాలన
ఆపరేషన్ కగార్‌పేరుతో
ఆదివాసీలను చంపుతున్నారు
సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యుడు
చాడ వెంకట్‌రెడ్డి