
తెలుగు భాషకు ప్రాధాన్యమివ్వాలి
తెయూ (డిచ్‌పల్లి): తెలుగు భాషకు అన్ని స్థాయిల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలని వివిధ కళాశాలల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో తెలుగు శాఖ విభాగాధిపతి సీహెచ్ లక్ష్మణ్ చక్రవర్తి అధ్యక్షతన తెలుగు అధ్యాపకుల వార్షిక సదస్సును బుధవారం నిర్వహించారు. సదస్సులో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకు ద్వితీయ భాషగా తెలుగు, మూడు సంవత్సరాలు, 20 క్రెడిట్స్‌తో ఉంది. కానీ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించి, 12 క్రెడిట్స్‌కు పరిమితం చేయాలని ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఇటీవల జరిపిన ఆనన్‌లైన్ సమావేశంలో నిర్ణయించడాన్ని అధ్యాపకులు ముక్తకంఠంతో ఖండించారు. యూజీసీ నిబంధనలను అనుసరించి భాష, సాహిత్యాలలో పీజీ కోర్సు చేయాలంటే డిగ్రీ స్థాయిలో తప్పనిసరి 20 క్రెడిట్లు ఉండాలనే నియమం ఉందని గుర్తుచేశారు. డిగ్రీ స్థాయిలో తెలుగు సబ్జెక్టును కోర్ సబ్జెక్టుగా దోస్త్‌లో సోషల్ సైన్సెస్, కామర్స్ కోర్సులలో బకెట్ సిస్టంలో చేర్చాలని, ఆసక్తి ఉన్న విద్యార్థులు తెలుగు చదువుకునే అవకాశం కల్పించాలన్నారు. తెలుగు భాషను ‘ఉద్యోగం‘ అనే దృష్టి కోణం నుంచి చూడడం ప్రభుత్వాలు మానుకోవాలన్నారు. విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి సాహిత్య బోధన ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీన్ ఆచార్య కే లావణ్య, ఆచార్య పీ కనకయ్య, వివిధ కళాశాలల తెలుగు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.