
వాటర్ ట్యాంక్ ఎక్కిన భార్యాభర్తలు
● ఆత్మహత్యకు యత్నం.. కాపాడిన పోలీసులు
రామారెడ్డి: కుటుంబంలో నెలకొన్న సమస్యలతో భార్యాభర్తలిద్దరూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రామారెడ్డి గ్రామానికి చెందిన దంపతులు అరుణ, శంకర్ గురువారం రామారెడ్డిలోని పెద్దమ్మ దుబ్బ మిషన్ భగీరథ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు భార్యాభర్తలను సముదాయించి కిందకి దించారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలుంటే పరిష్కరించుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలతోనే వారు ట్యాంకు ఎక్కినట్టు సమాచారం.
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రం ఎల్లమ్మ కుచ్చలో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు రాంచదర్‌పై కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. మూడు కుక్కలు ఒకేసారి వెంటపడి దాడి చేయగా ముఖానికి, చేతికి గాయాలు అయ్యాయి. బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో కేకలు వేయగా తల్లిదండ్రులు బయటకు వచ్చి కుక్కలను తరిమి కొట్టడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వాటర్ ట్యాంక్ ఎక్కిన భార్యాభర్తలు