
ఉల్లంఘనులకు బాసటగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగం ఆడిందే ఆ ట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకే ఫైల్ కు సంబంధించి పలుసార్లు తిరస్కరణలు చేస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత తక్షణమే నిబంధనలు పాటించకున్నప్పటికీ అనుమతులు ఇస్తున్నారు. పైగా దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలబడుతున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా ప్రత్యేక వ్యవస్థ మాదిరిగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. వందలో పది శాతం లోపు ఫిర్యాదు దారులు మాత్రమే హైకోర్టుకు వెళుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా ఉంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇతర ఫిర్యాదులనైతే ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
● ఖలీల్‌వాడిలో సెల్లార్ అనుమతి లేకుండా ఒక భవనం నిర్మాణం చేస్తున్నారు. దీనిపై 2024 డిసెంబర్ 31న మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు దారుడు హైకోర్టుకు వెళ్లాడు. దీంతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పనులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోడానికి బదులు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రాజేష్ మాత్రం అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న వ్యక్తికి, ఫిర్యాదు దారుడికి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
● ఖలీల్‌వాడి ప్రాంతాన్ని బంగారు బాతు మాదిరిగా మున్సిపల్ అధికారులు వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టీపీబీవోలు, టీపీఎస్‌లు, ఏసీపీలను ఆయా ఏరియాల్లో మార్పులు చేసినప్పటికీ టీపీఎస్ రాజేష్‌ను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఖలీల్‌వాడి ప్రాంతంలో రాజేష్ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వరుసగా వస్తున్నాయి. ఈ విషయాలపై కమిషనర్‌ను సంప్రదించగా విచారణ చేస్తామని వెల్లడించారు.
అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలుస్తున్న నగరపాలక సంస్థ అధికారులు
హైకోర్టు ఆదేశాలను సైతం అమలు
చేయకుండా నోటీసులతో సరి
సెటిల్‌మెంట్లు చేస్తున్న టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు
నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో బేరం కుదిరిన ఫైళ్లకే తక్షణ అనుమతులు ఇస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలబడుతున్నారు. కొంతమంది ఫిర్యాదు దారులు మాత్రమే హైకోర్టుకు వెళుతున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా అధికారులు షోకాజ్ నోటీసులతో సరిపెడుతున్నారు.
నగరంలోని దుబ్బ ఏరియాలో 3191/అ సర్వే నంబర్‌లో ఒక వ్యక్తికి చెందిన 32 గుంటల భూమిని మరో వ్యక్తి ఆక్రమించాడు. ఈ విషయమై బాధితుడు 2025 ఫిబ్రవరి 3న, 2025 మార్చి 25న నగరపాలక కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు 2025 ఏప్రిల్ 25 న ఇరుపార్టీలకు డాక్యుమెంట్లు తీసుకురావాలని నోటీసులు ఇచ్చారు. కాగా బాధితుడు హైకోర్టుకు వెళ్లాడు. ఆక్రమణదారుడిపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని, బాధితుడికి భూమి అప్పగించాలని కోర్టు మున్సిపల్ అధికారులకు రూలింగ్ ఇచ్చింది. కోర్టు రూలింగ్ మేరకు చర్యలు తీసుకోవడానికి బదులు మున్సిపల్ అధికారులు ఆక్రమణ దారుడికి ఈ నెల 13న షోకాజ్ నోటీసులు మాత్రం ఇచ్చి కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఉల్లంఘనులకు బాసటగా..