
పేరుకే క్రీడా ప్రాంగణాలు
● కానరాని వసతులు..
నిర్వహణ అస్తవ్యస్తం
● ఇబ్బందిపడుతున్న క్రీడాకారులు
● పట్టించుకోని అధికారులు
డిచ్‌పల్లి: పల్లెల్లో క్రీడాకారులను తీర్చిదిద్దడానికి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క క్రీడాప్రాంగణం అభివృద్ధికి నోచుకోలేదు. పల్లె ప్రగతిలో భాగంగా ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో స్థలం కొరతతో ఊరు బయట ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో, మరికొన్ని చోట్ల ఇరిగేషన్ శాఖ భూముల్లో బోర్డులు పెట్టి ఇదే క్రీడా ప్రాంగణం అంటూ అధికారులు చేతులు దులుపుకొన్నారు. ప్రాంగణాల్లో ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలకు సంబంధించిన కోర్టులను ఏర్పాటు చేశారు. అయితే అవి ఇప్పుడు కానరాకుండా పోయాయి. కేవలం ఇనుప బార్‌లు మాత్రమే మిగిలాయి. గత జనవరిలో నిర్వహించిన సీఎం కప్ నిర్వహణలో కూడా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను పట్టించుకోలేదు. భవిష్యత్తులో పట్టించుకుంటారనే నమ్మకం కూడా లేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రీడా సామగ్రి కరువు
గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో కనీసం ఇప్పటి వరకు క్రీడా సామగ్రి కూడా ఏర్పాటు చేయలేదు. కొన్ని గ్రామాల్లో తూతూ మంత్రంగా క్రికెట్, వాలీబాల్ కిట్లు, టెన్నికాయిట్ రింగ్స్ సరఫరా చేశారు. కానీ పలు గ్రామాల్లో వాటిని ఎవరు వినియోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాంగణంలో క్రీడా కోర్టులు ఏర్పాటు చేయక పోవడంతోపాటు క్రీడలు ఆడేవారు లేకపోవడంతో పలు గ్రామాల్లో పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. క్రీడా సామగ్రిని సరఫరా చేయాలని యువకులు రోజుల తరబడి డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే వారే లేకుండపోయారు. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసి కనీసం సరిహద్దులు ఏర్పాటు చేయాలని యువకులు కోరుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే క్రీడా సామగ్రిని సరఫరా చేయడంతో పాటు ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.

పేరుకే క్రీడా ప్రాంగణాలు