భైంసా: వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయరంగాన్ని తీవ్ర నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయి. అకాల వర్షాలు, కరువు, వరదలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి, సోయాబీన్, పత్తి, పసుపు, మిర్చి, మొక్కజొన్న, కంది తది తర పంటలు లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తుంటారు. ఒక్కో ఎకరాకు రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ప్రకృతి వైపరీ త్యాలతో పంట నష్టపోయినప్పుడు అన్నదాతలంతా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
జిల్లాతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోనూ ఒకే తరహా వాతావరణ పరిస్థితులుంటాయి. అక్క డి రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో ఆదుకుంటోంది. రైతులు నామమాత్రపు ప్రీమియంతో బీమా చేయించుకుని ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నపుడు పరిహారం పొందుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్రలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఫసల్ బీమా కింద పరిహారం అందింది. అదే సమయంలో నిర్మల్ జిల్లాలోనూ భారీ వర్షాలకు వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పొలాలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.అయినప్పటికీ బీమా పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతు వాటా చాలా తక్కువ. మిగతా ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో తెలంగాణలో ఈ పథకం అమలులో లేకుండా పోయింది.
ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు
వాతావరణ నిపుణులు తెలిపిన ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అకస్మాత్తుగా భారీ వర్షాలు లేదా దీర్ఘకాల వర్షాభావం, గాలివానలు, తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగే అవకాశముంది. దీంతో పంటల దిగుబడి తగ్గి రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు మరింత పెరిగే అవకాశమున్నందున జిల్లా రైతాంగానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా అవసరం తప్పనిసరి నిపుణులు సూచిస్తున్నారు.


