ఇల్లు పూర్తయినా.. బిల్లు రాలే! | - | Sakshi
Sakshi News home page

ఇల్లు పూర్తయినా.. బిల్లు రాలే!

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

● ఇందిరమ్మ లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ ● అప్పులు తెచ్చి నిర్మాణాలు చేశామని ఆవేదన ● అధికారులు చొరవ చూపాలని వేడుకోలు

నిర్మల్‌చైన్‌గేట్‌: పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు ప్రారంభించింది. మొదట సొంత స్థలం ఉన్నవారిని ఎంపిక చేసింది. జిల్లాలో 8,166 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 2,241 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే నిర్మాణంలో నిబంధనల ప్రకారం బిల్లులు విడతల వారీగా విడుదల చేస్తున్నారు.

కేంద్ర నిధుల కోసం ఎదురు చూపు..

పేదల ఇంటి నిర్మాణం కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ పథకం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షల వరకు కేంద్రం సహాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ నిధులు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు చివరి బిల్లుగా ఇవ్వాలని భావిస్తోంది.

పీఎంఏవై ప్లస్‌ యాప్‌లో నమోదు..

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు దశల్లో సర్వే చేపట్టింది. కేంద్ర పథకం పీఎంఏవైజీ మార్గదర్శకాల ప్రకారం పూరిగుడిసెలు లేదా తాత్కాలిక ఆవాసాల్లో ఉన్న వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి సర్వే చేపట్టి, పీఎంఏవై ప్లస్‌ యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా ఇప్పటికే మంజూరైన ఇళ్ల లబ్దిదారుల ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడంతోపాటు కొత్త అర్హులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి నిధులు విడుదల కావచ్చని భావిస్తున్నారు. లబ్దిదారులు వెంటనే బకాయి బిల్లులు విడుదల చేయాలని, లేదా కేంద్ర నిధులు వచ్చే వరకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వివరాలు

మొత్తం సాంక్షన్‌ 8,166

విల్లింగ్‌ ఉన్నవారు 7,029

ముగ్గు పోసినవి 1,331

బేస్మెంట్‌ లెవెల్‌ 1,052

గోడలు పూర్తయినవి 747

స్లాబ్‌ పూర్తయినవి 1,658

నిర్మాణం పూర్తయినవి 2,241

చివరి విడత పెండింగ్‌..

నిర్మాణ నిబంధనల ప్రకారం.. బేస్‌మెంట్‌ పూర్తయి న తర్వాత రూ.లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మ రో రూ.లక్ష, స్లాబ్‌ పడ్డాక రూ.1.40 లక్షలు విడుదల చేశారు. మిగిలిన రూ.1.60 లక్షలు బకాయిగా ఉన్నాయి. ఈ చివరి విడత బిల్లులు రాకపోవడంతో లబ్దిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా చివరి బిల్లులు రాకపోగా, రెండో విడత ఇళ్ల మంజూరుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

లబ్ధిదారులపై వడ్డీల భారం..

ఇందిరమ్మ ఇంటి బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు అప్పులు తెచ్చుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. బేస్‌మెంట్‌, గోడలు, స్లాబ్‌ పూర్తయిన తర్వాత కూడా బిల్లులు ఆలస్యంగా రావడంతో కొందరు బంగారం, భూములు కుదవ పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. కొందరు బేస్‌మెంట్‌, గోడల వరకే నిర్మాణం చేసి మిగిలిన పని ఆపేశారు. అధికారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు సైతం సమకూర్చారు. అయితే బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పెరుగుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement