నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రచయితల వేదిక గౌరవ అధ్యక్షుడు దామెర రాములు సాహితీరంగంలో చేస్తున్న సేవలు వర్ధమానకవులకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అన్నారు. రాములు జన్మదినం నిర్మల్ నర్సింగ్ హోమ్‌లోని దామెర సాహితి క్షేత్రంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాహితీగోష్టిలో పలువురు కవులు తమ కవిత్వంతో దామెర సాహిత్య సేవలను, కవిత్వంలోని సామాజిక స్పృహను, తెలంగాణ భాషా–సాహిత్య అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, ఉపాధ్యక్షుడు అంబటి నారాయణ, సలహాదారులు డాక్టర్ తుమ్మల దేవరావు, పత్తి శివప్రసాద్, సాహిత్య విమర్శకుడు అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా కోశాధికారి పోలీస్ భీమేష్, అలాగే సంతోష్, ఫక్రుద్దీన్, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


