నిర్మల్‌చైన్‌గేట్/లక్ష్మణచాంద: అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జిల్లా కేంద్రంలో, సోన్ మండల కేంద్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గాజులపేట్, బుధవార్‌పేట్, బంగల్‌పేట్, బెస్తవారిపేట్, గుల్జార్ మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్ కాలనీ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌వోలు), కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. ఓటరు నమోదు సమయంలో ఎదురవుతున్న సమస్యలను బీఎల్‌వోలు, బీఎల్‌ఏలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, కౌన్సిలర్లు పెండెం శ్రీనివాస్, నాందేడపు చిన్ను, జాకీర్, ఇమ్రాన్ ఉల్లా, ఎస్పీ రాజు, లక్కాకుల హరీశ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్, సోన్ మండల అధ్యక్షుడు మొయినుద్దీన్, మధుకర్‌రెడ్డి, వేణుగోపాల్, విలాస్, భూమారెడ్డి, ముత్యంరెడ్డి, జి.శ్రీనివాస్‌గౌడ్, భుజంగ శ్రీనివాస్‌రెడ్డి, సోన్ సర్పంచ్ అంపోలి వనజ, పార్టీ మండల అధ్యక్షుడు మోయినుద్దీన్, మధుకర్‌రెడ్డి, ఆత్మా డైరెక్టర్ గాండ్ల లింగన్న, మురళీధర్‌రెడ్డి, రాజా నరసింహారెడ్డి, అజహర్, వినోద్, కాంతయ్య, అనిల్, జగన్ తదితరులుపాల్గొన్నారు.


