దస్తురాబాద్: వర్షాలు సమృద్ధిగా కురవాలని దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన గ్రామస్తులు శనివారం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. గండి నరసింహస్వామికి పూజలు చేశారు. స్వామివారిని పూజిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండతాయని, పశువులకు వ్యాధులు రావని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయం ప్రకారం శుక్రవారం గ్రామంలో యువకులు, పెద్దలు కప్పతల్లి ఆటలు ఆడుతూ, అర్చకులు గ్రామ సమీపంలో వరద పాశం చేసి ప్రసాదం పంచారు. శనివారం కొండ మీది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బయలుదేరారు. నాలుగు కిలోమీటర్లు నడిచి కొండ మీది ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ముందుగా గుట్టల కింది భాగంలో ఉన్న పెద్ద బండరాయి వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు, దీపారాధన చేసి యాత్రను ప్రారంభించారు. పూజల అనంతరం అన్నదానం చేశారు.


