నిర్మల్‌టౌన్: పోలీసుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. పోలీసుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలోని ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ప్రత్యేక దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముందు వారాంతపు పరేడ్‌ను నిర్వహించి, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం ఏఆర్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో ముఖాముఖి సమావేశమైన ఎస్పీ, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ పోలీసు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. వ్యక్తిగత లేదా విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా ఉన్నతాధికారులు, సహచరులతో మాట్లాడి పరిష్కారం వెతకాలన్నారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ వారి సంక్షేమంపైనా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా హోంగార్డులు, మహిళా పోలీసు సిబ్బంది తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రామ్ నిరంజన్‌రావు(అడ్మిన్), శేఖర్, రామకృష్ణ, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.


