ఫలించిన బేసిక్‌ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఫలించిన బేసిక్‌ పోరాటం

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

● సింగరేణిలో జనరల్‌ అసిస్టెంట్లకు పెరగనున్న వేతనం ● కంపెనీ వ్యాప్తంగా 2,500మందికి ప్రయోజనం

శ్రీరాంపూర్‌: తమకు జరుగుతున్న నష్టాన్ని సవరించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన సింగరేణి కార్మికులకు న్యాయం దక్కింది. వీరి పోరాటం అనేకమందికి ప్రయోజనం కలిగిస్తోంది. సింగరేణి కంపెనీలో డిపెండెంట్‌ కింద ఉద్యోగంలో చేరిన వారికి అండర్‌గ్రౌండ్‌లో జనరల్‌ అసిస్టెంట్‌ డిజిగ్నేషన్‌ కల్పించి ఒకటో కేటగిరి బేసిక్‌ వేతనం చెల్లిస్తారు. సర్వీసు పెరిగిన కొద్దీ వేతనం పెరుగుతుంది. కానీ 30ఏళ్లు పనిచేసిన జనరల్‌ అసిస్టెంట్‌ ఏదైనా కారణాలతో సర్ఫేస్‌కు వస్తే వేతనం ఒక్కసారిగా తగ్గిస్తున్నారు. తనకున్న సర్వీసుతో అప్పటివరకు భూగర్భంలో 4వ కేటగిరి బేసిక వేతనం పొందినప్పటికీ సర్ఫేస్‌లోకి వస్తే తిరిగి ఒకటో కేటగిరి బేసిక్‌ కట్టిస్తున్నారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత ఉందో అంతే కట్టిస్తూ వేతనం చెల్లిస్తున్నారు. ఇది డీ ప్రమోట్‌ను తలపిస్తుంది.

నిబంధనలకు పాతర

అండర్‌గ్రౌండ్‌ జనరల్‌ అసిస్టెంట్లు సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్‌గా మారడానికి సంస్థ నిబంధనల ప్రకా రం రెండు రకాల విధానాలు ఉన్నాయి. భూగర్భంలో పనికి ఆరోగ్యం సహకరించకపోతే కార్మికుడు స్వచ్ఛందంగా సర్ఫేస్‌ పోస్టు కోరుకుంటే 1వ కేటగి రి బేసిక్‌ వేతనం చెల్లిస్తారు. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత ఉందో అంతే దక్కుతుంది. సర్ఫేస్‌లో ఖాళీల భర్తీకి కంపెనీ దరఖాస్తులు స్వీకరించి సీనియారిటీ ఆధారంగా భర్తీ చేస్తుంది. వీరి వేతనాన్ని ఏమాత్రం తగ్గించకుండా బేసిక్‌ ప్రొటెక్షన్‌ కల్పిస్తూ సర్ఫేస్‌ పోస్టింగ్‌ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన చాలా ఏళ్లుగా అమలు చేయకపోవడంతో సర్ఫేస్‌లోకి మారిన ఒక్కో కార్మికుడు నెలకు రూ.10వేలకు పైగా నష్టపోతున్నారు.

ఐదేళ్లుగా న్యాయపోరాటం

కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో 2020లో సత్తుపల్లి కిష్టాపూర్‌ ఓసీపీలోని 12మంది, 2021లో భూపాలపల్లిలోని మరో 11మంది జనరల్‌ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం బేసిక్‌ వేజ్‌ ప్రొటెక్షన్‌ కల్పించాలని, ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో నష్టపోతున్నామని విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కార్మికులకు న్యాయం చేస్తూ వేజ్‌ ప్రొటెక్షన్‌ కల్పించాలని ఈ నెల 15న ఆదేశాలు ఇచ్చింది. అండర్‌గ్రౌండ్‌లో ఎంత బేసిక్‌ ఉందో దాన్ని ప్రొటెక్ట్‌ చేస్తూ సర్ఫేస్‌లోనూ కట్టివ్వాలని పేర్కొంది. అంతేగాకుండా అప్పటివరకు వచ్చిన ఎస్‌ఎల్‌పీలు, ప్రమోషన్లు ఉంటే వాటిని కూడా కట్టివ్వాలని, గత కాలానికి ఏరియర్స్‌తో మూడు నెలల్లో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత న్యాయం జరిగింది. ఈ కేసులో ఉన్న 23మందికే కాకుండా కంపెనీవ్యాప్తంగా ఉన్న 2,500మంది జనరల్‌ అసిస్టెంట్లకు తీర్పు వర్తించి ప్రయోజనం కలుగనుంది. కోర్టు ఆదేశాల ఆధారంగా సదరు కార్మికులు కంపెనీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. సీనియర్‌ కార్మికులకు నెలకు రూ.10వేల వరకు వేతనం పెరగనుంది. గ్రాట్యూటీ, పింఛన్‌ కూడా పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement