వృద్ధుడి హత్య కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి హత్య కేసు ఛేదన

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

● గంటల వ్యవధిలో నిందితుడి అరెస్టు ● వెల్లడించిన సీఐ సంజయ్‌

రెబ్బెన: మండలంలో సంచలనం రేపిన వృద్ధుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మండలకేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో ఎస్సై వెంకటకృష్ణతో కలిసి సీఐ సంజయ్‌ శనివా రం వివరాలు వెల్లడించారు. తుంగెడ పంచాయతీ పరిధిలోని కొత్తగూడకు చెందిన బోగారపు నగేశ్‌ మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు అందరినీ డబ్బులు అడిగేవాడు. శుక్రవారం పర్సనంబాలకు చెందిన మాసాడే సోమయ్య(65) తన భార్య కరుణబాయి, చిన్న కూతురు సుజాతతో కలిసి పెద్ద కూతురైన లక్ష్మిని రైలు ఎక్కించేందుకు రెబ్బెనలోని ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. టీ తాగి వస్తానని వారికి చెప్పి సోమయ్య బస్టాండ్‌ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో బోగారపు నగేశ్‌ అక్కడే ఉండగా సోమయ్య టీ తాగి తిరిగి రైల్వేస్టేషన్‌ వస్తున్నాడు. సోమయ్య వద్ద డబ్బులను చూసిన నగేశ్‌ తనకు ఇవ్వాలని అడుగగా నిరాకరించాడు. ఆగ్రహానికి గురై సోమయ్యను చంపాలని వెంబడించాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో సోమయ్య మెడపై దాడి చేసి తల మొండెం వేరుచేశాడు. తర్వాత భయంతో పారిపోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ అశోక్‌, సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటకృష్ణ.. ఘటనస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. సీసీపుటేజీలను పరిశీలించారు. నిందితుడు రైల్వే మార్గం ద్వారా తప్పించుకున్నట్లు గుర్తించారు. ఎస్పీ నితికపంత్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీపుటేజీ ఆధారంగా సిర్పూర్‌ (టి) రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. తాగేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కారణంతో హత్య చేసినట్లు వెల్లడించారు. చాకచక్యంగా నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్సై నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement