పెండింగ్ అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నిర్మల్‌లో ఉన్నతస్థాయి సమీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ఎస్సీ, ఎస్టీలకు అందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, రిజర్వేషన్ ని బంధనల అమలుపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభంలో చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, కమిషన్ సభ్యులు డాక్టర్ బీఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతి, అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, బాధితులకు పరిహారం చెల్లింపు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వివరాలు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్లు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఉపాధి కల్పన వంటి అంశాలను శాఖల వారీగా సమీక్షించారు.
సమన్వయంతో పనిచేయాలి..
అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్ర యోజనాలు ఆలస్యం లేకుండా అందేలా అన్ని శా ఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ప్రతీనెల చివరి వారంలో మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మూడు నెలలకోసారి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
సమర్థవంతంగా అమలు..
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవుతున్నాయని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపా రు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ కామన్ మెనూ అమలు చేస్తున్న ట్లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనా లు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 4,306 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు, ఈజీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ కూలీలకు ఉపాధి కల్పనలో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా 199 ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహనాలు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అట్రా సిటీ కేసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మణారాయణ, అదనపు కలెక్ట ర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పించాలి..
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీకి తగిన పని దినాలు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వెంకటయ్య సూచించారు. అభివృద్ధి నిధులు ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి విడుదల చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 60 ఏళ్లు నిండిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.


