కడెం: ‘నేనింతే.. ముక్కుసూటిగా వెళ్లడమే నా వ్యక్తిత్వం. దానిని చూసి కొందరు ఎమ్మెల్యే అయ్యాక మారిపోయాడు అంటున్నరు’ అని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం మండలంలో సర్ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. తనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదన్నారు. రూ.2 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని తెలిపారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లో ఏ పని కోసం, పదవుల కోసం ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించాలని సవాల్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, తనను గెలిపించిన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని ప్రకటించారు. ఆదివాసీ బిడ్డనని, ఎమ్మెల్యేగా నా ఎదుగుదలను కొందరు చూడలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోసం కాదు.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని, పార్టీలో మీ పనితనంతో నా మనసును గెలిచి పదవులు పొందాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యేకు పైసలు ఇస్తే పదవి వస్తదన్న ఆలోచన మానుకోవాలని తెలిపారు. పార్టీలో జూనియర్లు, సీనియర్లు అంటూ విభేదాలు సృష్టించొద్దని నాయకులకు సూచించారు.


