భైంసారూరల్: జిల్లాలో భూ భారతి రీసర్వే ప్రక్రియ ను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. భైంసా మండలం ఎగ్గాం గ్రామపంచాయతీ పరిధి లోని బాబుల్‌గాం శివారులో కొనసాగుతున్న భూ భారతి రీసర్వేను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. సర్వే పొరపాట్లకు తావులేకుండా చూడాలని రెవెన్యూ, సర్వే అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రతీ భూ సరిహద్దును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రైతులకు భూ భారతి రీ సర్వేతో కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. వాతా వరణ పరిస్థితులు, నీటి లభ్యత, వర్షాలను బట్టి పంటలు సాగుచేయాలని, పంట మార్పిడి విధానా లపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కలెక్టర్‌ను కోరారు. సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, తహసీల్దార్ శశిభూషణ్, సర్వేయర్ నరసింహమూర్తి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


