సబ్‌స్టేషన్‌... ఆటోమేషన్‌ | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌... ఆటోమేషన్‌

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

విద్యుత్‌ సరఫరాలో సాంకేతిక విప్లవం జిల్లాలో 3 సబ్‌ స్టేషన్లలో శ్రీకారం ఆపరేటర్‌ లేకుండానే ఇక సేవలు ఈనెలాఖరు నుంచి అందుబాటులోకి..

లక్ష్మణచాంద: విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్వహణలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మానవ రహిత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమేషన్‌ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఈ విధానం విజయవంతంగా అమలు అవుతోంది. తెలంగాణలో మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఈ ఆటోమేషన్‌ విధానాన్ని అమలు చేశారు. అక్కడ విజయవంతంగా నడుస్తుండటంతో, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని మిగిలిన జిల్లాల్లోని 33/11 కేవీ సబ్‌ స్టేషన్లలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

జిల్లాలోని మూడు సబ్‌స్టేషన్లలో..

జిల్లాలో సోన్‌ మండలం మాదాపూర్‌, మామడ మండల కేంద్రం, దిలావార్‌పూర్‌ సబ్‌ స్టేషన్లలో ఆటోమేషన్‌ అమలు చేయాలని విద్యుత్‌ శాఖ నిర్ణయించింది. ఈమేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. మూడు సబ్‌ స్టేషన్లలో ఆటోమేషన్‌ విధానం అమలు చేసేందుకు సీసీ కెమెరాలు అమర్చే పనులు జరుగుతున్నాయి. పనులను త్వరలోనే పూర్తి చేసి ఈ నెలాఖరు వరకు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈ నాగరాజు తెలిపారు.

రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మేనేజ్‌మెంట్‌ విధానం

సబ్‌ స్టేషన్ల ఆటోమేషన్‌కు రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమలు చేస్తారు. దీంతో 11 కేవీ విద్యుత్‌ సరఫరా ఫీడర్ల ఆన్‌–ఆఫ్‌ను ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో అనుసంధానిస్తారు. తద్వారా సిబ్బంది అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా సబ్స్టేషన్‌ను ఆపరేట్‌ చేసే అవకాశం ఏర్పడుతుంది. సబ్‌ స్టేషన్‌కు సంబంధించిన సరఫరా, అంతరాయాలు, ఇతర సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు, సంబంధిత అధికారుల సెల్‌ఫోన్‌లకు సమాచారం చేరుతుంది. దీంతో ఎక్కడైనా ఇబ్బంది ఎదురైనా తక్షణమే తెలుసుకుని మరమ్మత్తు చేసి, విద్యుత్‌ సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తారు. ఫలితంగా ఎక్కువ సమయం అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందుతుందని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement