బాసర: బాసర రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు భద్రత కరువైంది. సెక్యూరిటీ వైఫల్యాలను అలుసుగా తీసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ చోరీలు పెరుగుతున్నాయి. తాజాగా నాగర్‌సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. షిరిడి సాయిబాబా దర్శనం ముగించుకుని కుటుంబ సభ్యులతో కాజీపేటకు తిరుగు ప్రయాణం చేస్తున్న రవికుమార్ కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలు ఆదివారం రాత్రి ఎస్9 బోగీలో కిటికీ పక్కన కూర్చుంది. రైలు బాసర స్టేషన్‌లో ఆగిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కిటికీలోంచి చేయి పెట్టి ఆమె మెడలో ఉన్న సుమారు ఆరు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ప్రయాణికులు అప్రమత్తమై దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ చీకట్లో తప్పించుకున్నాడు.
కాజీపేటలో ఫిర్యాదు..
బాధితురాలు కాజీపేట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసును నిజామాబాద్ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు మంగళవారం బాసర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. ప్లాట్‌ఫారాలు, ట్రాక్ పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
భద్రతా లోపాలు బహిర్గతం
ఈ ఘటనతో బాసర రైల్వే స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టేషన్ ఆవరణ, ప్లాట్‌ఫారాలు, ప్రవేశ ద్వారాలు, ట్రాక్ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేక దొంగలు సులభంగా తప్పించుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైరిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భద్రత పెంచాలని డిమాండ్
బాసర రైల్వే స్టేషన్ జిల్లాలో అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి, ఆర్జీయూకేటీ(ట్రిపుల్ ఐటీ) విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగిస్తున్నారు. ఇంత రద్దీగా ఉండే స్టేషన్‌లో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు రైల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్), జీఆర్పీ పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుని ప్రయాణికులు, భక్తులకు పూర్తి భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


