ఖానాపూర్: ఖానాపూర్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించడంతోపాటు శాశ్వత న్యాయస్థాన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్ ఆధ్వర్యంలోని న్యాయవాదుల బృందం హైకోర్టులో నిర్మల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ కె.సుజనను కోరారు. మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. రెగ్యులర్ జడ్జి లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. శాశ్వత కోర్టు భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం స్వీకరించిన జస్టిస్ కె.సుజన సానుకూలంగా స్పందించారు. అనంతరం న్యాయవాదుల బృందం ఇటీవల తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై న సురేందర్‌రెడ్డిని కలిసి సన్మానించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సురేందర్‌రెడ్డి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. సీనియర్ న్యాయవాదులు వెంకట్ మహేంద్ర, బక్కశెట్టి కిశోర్, ఏజీపీ ఆసిఫ్ అలీ, న్యాయవాదులు చిన్నం సత్యం, బాసెట్టి శివ, సురేందర్, ఐదు వెంకటేశ్, నరేంద్రనాథ్, ఖదిర్, అశోక్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.


