నిర్మల్‌చైన్‌గేట్:జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సీయస్ దాటుతున్నాయి. ఎండలకు వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు వడదెబ్బతో మృతిచెందారు. తలనొప్పి, జ్వరం తదితర సమస్యలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతున్నవారు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సన్‌స్ట్రోక్‌ను లైట్‌గా తీసుకోవద్దని డీఎంహెచ్‌వో రాజేందర్ సూచించారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
సాక్షి : వడదెబ్బ లక్షణాలను ఎలా గుర్తించాలి?
డీఎంహెచ్‌వో : తలనొప్పి, అధిక జ్వరం (107 డిగ్రీల టెంపరేచర్), శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం, స్పృహ కోల్పోవడం, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్పృహ కోల్పోయిన సమయంలో శరీరంపై ఉన్న దుస్తులు తొలగించాలి. నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడిచి వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. డీహైడ్రేషన్‌ను అశ్రద్ధ చేస్తే, గుండె, కిడ్నీలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మృతి చెందే అవకాశాలు ఉంటాయి.
సాక్షి : వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో : అవసరమైతే తప్ప బయటికి రావొద్దు. ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, మాంసం, చికెన్ లాంటివి తీసుకోకపోవడం ఉత్తమం. జ్వరం, తలనొప్పి, ఇతర వడదెబ్బ లక్షణాలు, సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సాక్షి : బయటకు వెళ్లేప్పుడు ఏం చేయాలి?
డీఎంహెచ్‌వో : బయటికి వెళ్లేప్పుడు తలకు తెల్లని టోపీ పెట్టుకోవాలి. కళ్లజోడుతోపాటు చెవులు, ముక్కులోకి వేడిగాలులు ప్రవేశించకుండా రుమాలు కట్టుకోవాలి. తెల్లని, కాటన్ దుస్తులు ధరించాలి. సిల్క్, నైలాన్ వంటి దుస్తులు ధరించొద్దు. సెలవుల్లో చిన్నారులు ఎక్కువగా బయట ఆడుతుంటారు. ఈ క్రమంలో నీరు తీసుకోవడంపై అశ్రద్ధ వహిస్తారు. తల్లిదండ్రులు గమనించి తరచూ నీటిని తాగించాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
సాక్షి : ఎండల ప్రభావం ఎవరిపై ఎక్కువ...
డీఎంహెచ్‌వో : ఎండల ప్రభావం మధుమేహం, రక్తపోటు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, సిగరేట్, ఆల్కాహాల్ సేవించేవారిపై ఎక్కువగా ఉంటుంది. వీరు ఎండలో ఎక్కువసేపు ఉండొద్దు. తలుపులు మూసి ఇంట్లో ఉన్నా వృద్ధులు, చిన్నారులు సైతం వేడి ప్రభావంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు వడగాలులు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సాక్షి : ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?
డీఎంహెచ్‌వో : వడగాలులకు శరీరంలోని నీరుచెమట రూపంలో ఆవిరైపోతుంది. సాధారణ రోజుల్లో కన్నా 3 లీటర్ల వరకు నీటిని అధికంగా తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసు కోవాలి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్, చల్లని నీటి కన్నా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగితే మంచిది. పుచ్చకాయ, నిమ్మరసం, ద్రాక్షలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. రోజులో 4 నుంచి 5 లీటర్లు నీరు తాగాలి. కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది.
డాక్టర్ రాజేందర్
డీఎంహెచ్‌వో


