ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

● నేనూ గవర్నమెంట్‌ స్కూల్‌ స్టూడెంట్‌నే.. ● ముగిసిన విద్యా వారోత్సవాలు

కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో విద్యా వారోత్సవాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు పాల్గొని విజయవంతం చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కూడా గవర్నమెంట్‌ స్కూల్‌ విద్యార్థినే అని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి అనేక మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటలు, పాటలు, యానిమేషన్‌, డాన్స్‌, పెయింటింగ్‌ వంటి రంగాల్లోనూ ప్రతిభ కనబర్చాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని తెలిపారు. ఇది జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులను నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈవో భోజన్న, ఏసీజీఈ పరమేశ్వర్‌, అధికారులు, ఎంఈవోలు, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement