ఎమ్మెల్యే వైఖరితోనే కొనుగోళ్లలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వైఖరితోనే కొనుగోళ్లలో జాప్యం

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

● మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎమ్మెల్యేగా ఉండి నిర్మల్‌ నియోజకవర్గంలో మొక్కజొన్న, వరి, జొన్న కొనుగోళ్ల రైతులకు న్యాయం చేయలేని దుస్థితి ఏర్పడిందని, ఎమ్మెల్యే వైఖరితోనే నిర్మల్‌ నియోజకవర్గంలో రైతులు గోసపడుతున్నారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్న మహేశ్వర్‌రెడ్డి ప్రజాకోర్టులో ద్రోహిగా మారే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కొనుగోళ్లపై ఇప్పటివరకు ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించకపోవడం ఆయనకు పంటలు, రైతులపై ఉన్న అవగాహన లేమికి నిదర్శనమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ప్రతీ గింజ కొనుగోలు చేస్తుందని తెలిపారు. జిల్లాలో తన హయాంలో మంజూరైన పనులను ఎమ్మెల్యే పర్సెంటేజీల కోసం అడ్డుకుంటున్నారని, ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నరేళ్లు పూర్తయినా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఏమి చేశారని ప్రశ్నించారు. ఆర్మూర్‌, ఆది లాబాద్‌ రైల్వేలైన్‌ మంజూరు చేయించడంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీ విఫలమయ్యారని విమర్శించారు. నిర్మల్‌లో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ, మెడికల్‌ కాలేజీ, హరిత హోటల్‌, నర్సింగ్‌ కళాశాల పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు రఘునందన్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బన్సపల్లి రమణారెడ్డి, రాందాస్‌, కృష్ణ ప్రసాద్‌రెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement