గన్నీలు లేవు.. లారీలు రావు..! | - | Sakshi
Sakshi News home page

గన్నీలు లేవు.. లారీలు రావు..!

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● లూటీ అవుతున్న మక్క రైతులు ● చోద్యం చేస్తున్న పాలకులు

భైంసా/భైంసాటౌన్‌/ఖానాపూర్‌: జిల్లాలో మక్కల విక్రయానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట విక్రయిద్దామంటే ఓ వైపు అకాల వర్షాల బెడద, మరోవైపు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత, ఇంకో వైపు మక్కలు తరలించేందుకు సకాలంలో లారీలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. గోదాముల వద్ద రోజుల తరబడి లారీలు అన్‌లోడ్‌ కాకపోవడంతో కేంద్రాల నుంచి సకాలంలో మక్కలు తరలడం లేదు. అకాల వర్షాల భయంతో రైతులు గోదాముల వద్దకే వచ్చి లారీలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఓ గ్రామ ప్రజాప్రతినిధి ఏకంగా సంచికి రూ.45 చెల్లిస్తానని చెప్పి లారీ డ్రైవర్‌తో మాట్లాడుకుని లారీ తీసుకెళ్లినట్లు పలువురు రైతులు పేర్కొన్నారు. దీన్ని బట్టి రైతుల దయనీయ స్థితి అర్థం అవుతోంది. ఇదే అదనుగా కొందరు లారీ డ్రైవర్లు ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారి వద్దకే వెళ్తున్నారు. గన్నీ సంచులు సైతం లేకపోవడంతో ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకుంటున్నారు. గన్నీ సంచులు మొదలు, లారీల్లో తరలింపు కోసం రైతులు లూటీ అవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు.

లారీల కోసం ఎదురుచూపు..

జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొ నుగోళ్లు చేపడుతున్నారు. మొత్తంగా లక్ష మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 76,043 మెట్రిక్‌ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో నుంచి 56,523 మెట్రిక్‌ టన్నులను గోదాములకు తరలించారు. అంటే ఇంకా దాదాపు సగానికిపైగా మక్కలు కల్లాల్లోనే ఉన్నాయి. అకాల వర్ష భయంతో రైతులు కల్లాల్లోనే పంట కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఉంచుతున్నారు. కాంటాలు అయినా.. గోదాములకు తరలించకపోవడంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నామని రైతులు చెబుతున్నారు.

నియంత్రణ కరువు..

కొనుగోలు కేంద్రాల నుంచి మక్కలు తరలిస్తున్న లారీలు గోదాముల వద్ద సకాలంలో అన్‌లోడింగ్‌ కావడం లేదు. హమాలీల కొరత, ఎండల తీవ్రత నేపథ్యంలో కూలీలు అన్‌లోడింగ్‌కు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రోజుల తరబడి అక్కడే లారీలు ఉండడంతో, కేంద్రాల నుంచి మక్కల తరలింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లారీల కేటాయింపులో అధికారులు, ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారు నియంత్రణ లేకపోవడంతో కొందరు లారీ డ్రైవర్లు రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారి వద్దకే వెళ్తున్నారు. క్వింటాల్‌కు రూ.70 వరకు డబ్బులు తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం స్పందించి రైతుల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.

లారీ డ్రైవర్లకు డబ్బులు ఇవ్వొద్దు..

హమాలీల కొరత కారణంగా గోదాముల వద్ద అన్‌లోడింగ్‌ సమస్య తలెత్తుతోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కొందరు రైతులు లారీ డ్రైవర్లకు డబ్బులు చెల్లించి లారీలను తీసుకెళ్తున్నట్లు తెలిసింది. అలాంటి లారీలకు సంబంధించి అన్‌లోడింగ్‌ చేయవద్దని పీఏసీఎస్‌ సిబ్బందికి సూచించాం. సొంతంగా వాహనాలు పెట్టిన రైతులకు వారి ఖాతాల్లోనే డబ్బులు జమచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గన్నీ సంచుల కొరత లేకుండా చూస్తాం.

– మహేశ్‌ కుమార్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం

లక్ష్మణచాంద: మండలంలోని వివిధ గ్రామాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్న ధాన్యం మండల కేంద్రంలోని గోదాముకు రైతులే సొంత ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అయితే గోదాముల వద్ద సరిపడా హమాలీలు లేకపోవడంతో అన్‌లోడింగ్‌ ఆలస్యం అవుతోంది. అధికారులు సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement