నిర్మల్‌చైన్‌గేట్: లక్ష్మణచాంద మండలం పీచర గ్రామంలో తమపై దాడి చేసిన వీడీసీ సభ్యులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ముదిరాజ్ మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. వీడీసీ సభ్యులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. హైకోర్టు ఆదేశాలను దిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొజ్జ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ చట్టం ప్రకారం గ్రామంలోని ఐదు చెరువులపై ముదిరాజ్ మత్స్యకారులకు నూతనంగా సొసైటీ ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈనెల 14న బ్రాహ్మణ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ముదిరాజ్ మత్స్యకారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వీడీసీ సభ్యులతోపాటు గ్రామస్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని చేపలు పట్టేందుకు ముదిరాజులకు రక్షణ కల్పించాలన్నారు. పీచర ముదిరాజ్ మత్స్య సహకార సొసైటీ సభ్యులు గుర్రం బోర్రన్న, బొమ్మరేని శ్రీకాంత్, సాయన్న, నరేశ్, ఉడుత మహేశ్ పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.


