అకాల వర్షం.. తడిసిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

ఖానాపూర్‌: ఖానాపూర్‌ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వర్షం కారణంగా పట్టణంలోని మార్కెట్‌యార్డుకు తెచ్చిన మొక్కజొన్న, వరిధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లలో జాప్యం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వరి ధాన్యానికి హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.32 వసూలు చేయగా, ప్రస్తుతం రూ.45 తీసుకుంటున్నారని ఆరోపించారు. హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తడిసిన వడ్లను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మొక్కజొన్న ధాన్యం తూకం వేసేందుకు హమాలీలు అందుబాటులో లేక తామే తూకం వేసుకుంటున్నామన్నారు. అయినా అధికారులు, నిర్వాహకులు క్వింటాల్‌కు రూ.50 చొప్పున హమాలీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మండలంలోని సేవ్యానాయక్‌ తండాలో అర్ధరాత్రి సమయంలో తాటి చెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. ఖానాపూర్‌ పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో విద్యుత్‌శాఖ అధికారులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు.

పెంబి మండలంలో..

పెంబి: మండలంలో బుధవారం అర్థరాత్రి ఈదురు గాలులతో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న, వరి ధాన్యం తడిసింది. మొక్కజొన్న కేంద్రంలో గన్నీ సంచుల కొరత ఉండటంతో తూకం వేయడంలో ఆలస్యం అవుతోందని రైతులు తెలిపారు. చేతికి వచ్చిన నువ్వు పంట అకాల వర్షానికి తడిసిపోయింది. మొక్కజొన్న, వరి కేంద్రాల్లో త్వరగా తూకం వేసేలా చూడాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మామడలో తడిసిన ధాన్యం

మామడ: అకాల వర్షాలు రైతులను ఇబ్బందిపెడుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట విక్రయించే సమయంలో వర్షం కారణంగా కొనుగో ళ్లు ఆలస్యం అవుతున్నాయి. బుధవారం రాత్రి మా మడ, న్యూసాంగ్వి గ్రామాల్లో కురిసిన వర్షం కారణంగా కల్లాలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసింది.

Advertisement
 
Advertisement
Advertisement