నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై గురువారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా అనుమతులు లభించిన ఇళ్లు, ప్రారంభించిన నిర్మాణాలు, అటవీ నిబంధనలతో ఆగిన ఇళ్లు తదితర అంశాలు సమీక్షించారు. తమ పరిధిలో ఉన్న అటవీ అంశాల పరిష్కారానికి అటవీ అధికారులు కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులు పరిశీలించి, అర్హత ఉన్న దరఖాస్తులను పైదశకు పంపించాలన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలుపూర్తి చేసేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి రేవంత్ చంద్ర, హౌసింగ్, ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీవోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలు అందించాలి..
నిర్మల్‌ఖిల్లా: రానున్న వానాకాలానికి సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలోని రైతులకు అన్ని పంటలకు నాణ్యమైన విత్తనాలు అందించాలని తెలిపారు. టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు విత్తన దుకాణాలు తనిఖీ చేస్తూ, విత్తనాల నాణ్యత పరిశీలించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలానికి సంబంధించి సరిపడా యూరియా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాప్ ద్వారా రైతులకు యూరియా ఇవ్వాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఏవో అంజిప్రసాద్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


