పంటల్లో.. మంటలు! | - | Sakshi
Sakshi News home page

పంటల్లో.. మంటలు!

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

● లూజ్‌ వైర్లు, తాగి పడేసిన బీడీలతో ప్రమాదాలు ● ఆజ్యం పోస్తున్న అధిక ఉష్ణోగ్రతలు

నిర్మల్‌: జిల్లాలో పంటలకు అంటుకుంటున్న మంటలు రైతన్నలను కంగారు పెడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే బుగ్గిపాలవుతుంటే కన్నీరుమున్నీరవుతున్నారు. పంటలు కాలిపోవడానికి వేలాడుతున్న లూజ్‌వైర్లే కారణమని చాలామంది రైతులు చెబుతుండగా, అధికారులు మాత్రం అదొక్కటే కారణం కాదని, రకరకాల కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు.

నిర్లక్ష్యం నిప్పులా..

పంట చివరిదశలో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. చిన్న నిప్పురవ్వ తగిలినా మంటలు అంటుకుంటా యి. పంటభూముల్లో గాలికి వేగంగా వ్యాపిస్తాయి. తాగిన తర్వాత పూర్తిగా ఆర్పకుండా పంటభూముల సమీపంలో పడేసిన బీడీ, సిగరెట్లు కూడా కష్టపడి పండించిన పంటలను కాల్చేస్తున్నాయి. అలాగే సమీపంలోనే వంట చేసుకున్న తర్వాత పూర్తిగా ఆర్పేయని నిప్పురవ్వలూ ప్రమాదమే.

పంటవ్యర్థాలకు పెట్టే మంటలు..

సీజన్‌ చివరి దశలో ఇప్పటికీ చాలామంది పంట పూర్తయిన రైతులు భూముల్లో మిగిలిన కొయ్యలు, వ్యర్థాలకు అక్కడే నిప్పు పెడుతున్నారు. ఈ మంటలు గాలికి వేగంగా వ్యాపిస్తాయి. పక్క చేళ్లలోని పంటలనూ బుగ్గిచేస్తాయి. మూడేళ్ల క్రితం సారంగపూర్‌ మండలంలో ఇలాగే వ్యర్థాలకు పెట్టిన నిప్పు వ్యాపించి దాదాపు ఇరవై ఎకరాల్లో పంటలు కాలిపోయాయి. ఇందులో డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులు, మోటార్లు సైతం బుగ్గిపాలయ్యాయి.

మండుతున్న ఎండలూ...

గతంలో ఎప్పుడూ లేనంతగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈమధ్య కాలంలో 44 డిగ్రీ సెల్సియస్‌ పైనే ఉంటున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలూ అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని సారంగపూర్‌, దిలావర్‌పూర్‌, మామడ అడవుల్లో నిప్పు అంటుకుంది. పంటభూముల్లోనూ మంటలకు మండుతున్న ఎండలూ కారణం కావొచ్చన్న వాదనలు ఉన్నాయి.

వేలాడుతున్న వైర్లు..

జిల్లాలోని కుభీర్‌, తానూరు, పెంబి, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌(జి), కుంటాల, భైంసా మండలాల్లో ఈమధ్యకాలంలో వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపు అన్నిచోట్లా చేతికొచ్చిన లేదా కోసి కుప్పలుగా పోసిన మొక్కజొన్న పంటనే దగ్ధమైంది. ఈ ప్రమాదాలు చోటుచేసుకున్న వాటిలో చాలామంది బాధిత రైతులు వేలాడుతున్న విద్యుత్‌తీగలు గాలికి ఒకదానికొక్కటి రాపిడి కావడం వల్ల నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నట్లు చెబుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర మంటలు రావడంతో కూడా పంటలకు అంటుకున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఇదొక్కటే కారణం కాదని అధికారులు చెబుతున్నారు. నల్లరేగడి భూములు కావడంతో చాలాచోట్ల కరెంటు స్తంభాలు వంగిపోవడం, కూరుకుపోవడం జరుగుతుంటాయి. వీటివల్ల వైర్లు లూజ్‌ అవుతాయి. అలాగే స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద వేసిన సపోర్టు వైర్లనూ కొంతమంది రైతులు కట్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కూడా వైర్లు వదులుగా మారి, ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

కరెంటే కారణం కాదు..

జిల్లాలో పంటభూముల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలకు విద్యుత్‌వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రధాన కారణం కాదు. వివిధ కారణాలతోనూ ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ జిల్లాలో ఎక్కడైనా లూజ్‌వైర్లు, లైన్లు ఉంటే వెంటనే తమ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. అవసరమైనచోట అదనపు

స్తంభాలు ఉచితంగా వేయిస్తాం.

– జాదవ్‌ సుభాష్‌, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ

Advertisement
 
Advertisement
Advertisement