భైంసా: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన జ్ఞాన సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర క్షేత్రంపై గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంలో బాసర అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇచ్చి రూ. 42 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల క్రితం బాసరలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసర ఆలయ మాస్టర్ ప్లాన్‌పై వివరించారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆలయ విస్తరణ, గర్భగుడి పునర్నిర్మాణం, గోదావరి స్నానఘట్టాలు, ఇతర అభివృద్ధి పనులు
చేపట్టనున్నారు.
ఇప్పటికీ ఇన్‌చార్జీ ఈవోనే..
బాసర ఆలయంలో గత కొన్నేళ్లుగా ఇన్‌చార్జీ ఈవోతోనే పాలన కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి బాసర పర్యటన నాటికై నా రెగ్యూలర్ ఈవోను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయ పరిపాలనలో తీవ్ర లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయానికి ఏళ్ల తరబడి శాశ్వత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) నియామకం జరగలేదు. దీని వల్ల కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, బాధ్యతాయుతమైన పర్యవేక్షణ లోపించడంతో అక్రమాలకు అవకాశం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది కొరత..
సిబ్బంది కొరత ఆలయ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ అసిస్టెంట్లలో మొత్తం 6 పోస్టులకు గాను 4 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్లలో 10 పోస్టులకు నలుగురు, రికార్డ్ అసిస్టెంట్లు ముగ్గురు, సూపరింటెండెంట్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక వాగ్దేవి సొసైటీ కింద 84 మంది పని చేస్తున్నారు. ఈ సిబ్బందిని లడ్డూ కౌంటర్లు, ఎలక్ట్రిషియన్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేయిస్తున్నారు. ప్రత్యేక పర్వ దినాల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
బాసర సరస్వతీ ఆలయం
సీఎం పర్యటన
బాసర మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.100 కోట్లతో సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పనుల శంకుస్థాపనలు సీఎం రేవంత్‌రెడ్డి చేయనున్నారు. ఇప్పటికే బాసర ఆలయ అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిగాయి. బాసర అభివృద్ధిపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ పలుమార్లు అసెంబ్లీలోనూ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే బాసర అభివృద్ధిపై చర్చించారు. సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


