● గత నెల 23న మగ శిశువుకు జననం
ఉట్నూర్‌రూరల్: మండలంలోని హీరాపూర్ –జే గ్రామానికి చెందిన గిరిజన బాలింత కుంర జంగుబాయి (32) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంర చందు –జంగుబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మొదటి సంతానం 7 సంవత్సరాల పాప ఉంది. రెండో కాన్పు కోసం జంగుబాయి గత నెల 22న రిమ్స్‌లో చేరింది. మరుసటి రోజు మగ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రిమ్స్‌లో నయం కాకపోవడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. మంగళవారం హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
తల్లి ప్రేమకు దూరం..
తల్లి జంగుబాయి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. జంగుబాయికి ఆసుపత్రిలో సరైన చికిత్స అందితే బతికి ఉండేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా సరైన వైద్యం అందలేదని వాపోతున్నారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నా చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులపై పోక్సో కేసు..?
నిర్మల్‌చైన్‌గేట్: పట్టణంలోని ఓ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గత నవంబర్‌లో జూనియర్ విద్యార్థిపై ఈవ్ టీజింగ్, లైంగిక దాడికి యత్నించిన కారణంగా అతడు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయమై కాస్త ఆలస్యంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై పట్టణ పోలీస్‌లను సంప్రదించగా స్పందించలేదు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మామడ: మండలంలోని రాశి మెట్ల గ్రామానికి చెందిన రాథోడ్ సతీశ్(26) బుధవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు సతీశ్ చేపల వేటకు వెళ్లాడు. విద్యుత్‌వైరు సాయంతో చేపలు పడుతుండగా వైరు కాలుకు తగలడంతో షాకు తగిలి మృతి చెందాడు. సతీశ్ మృతితో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఎస్సై హన్మాండ్లు సంఘటన స్థలం సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆభరణాలు అపహరణ
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మహిళ బ్యాగు నుంచి బంగారు ఆభరణాలు అపహరించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం నిర్మల్‌లోని బంధువుల ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మంగళవారం నిర్మల్ బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగులోని 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బస్సు బయల్దేరిన తర్వాత కొంతసేపటికి ఈ విషయం గుర్తించిన ఆమె, బంధువుల సహకారంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
మామడ: మండల కేంద్రం సమీపంలో బుధవారం కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు గాయపడ్డారు. నిర్మల్ నుంచి ఖానాపూర్‌కు వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఖానాపూర్ పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన ఎలగందుల శ్రీనివాస్ చేతికి, కాలుకు గాయాలు కాగా ప్రవీణ్ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను ఈఎంటి సురేశ్, పైలెట్ హఫీజ్‌లు చికిత్స అందించి నిర్మల్ ఆసుపత్రికి తరలించారు.


