ఆదిలాబాద్‌టౌన్: డబ్బుపై వ్యామోహంతో ఓ పని మనిషి కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడింది. ఈమేరకు ఇచ్చోడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దొంగలించిన 10 తులాల బంగారం, 10 తులాల వెండిని పోలీసులు రికవరీ చేశారు. బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇచ్చోడలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవార్ ప్రేమ్‌సింగ్ ఇంట్లో పని మనిషిగా ఉన్న ఇచ్చోడ మండలం అడిగామకు చెందిన దేవ లక్ష్మి ఆమె కూతురుతో కలిసి యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడింది. గత నెల 16న శుభకార్యానికి వెళ్లి వచ్చిన తర్వాత యజమాని కుటుంబం బంగారాన్ని ఇంట్లో భద్రపర్చారు. ఈ విషయాన్ని పని మనిషి లక్ష్మి గమనించి దొంగతనానికి కుట్ర పన్నింది. ఇంటి యజమాని లేని సమయంలో గత నెల 18న ఇంట్లో నుంచి బంగారం, వెండిని అపహరించింది. 26న మరో శుభకార్యానికి వెళ్లేందుకు యజమాని కుటుంబ సభ్యులు ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. 27న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. దొంగలించిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించిన సమయంలో ఇచ్చోడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.


