లక్ష్మణచాంద: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికులు కీలకం. నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తూ పల్లెలను శుభ్రంగా ఉంచుతున్న కార్మికులు మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి శుభవార్త చెప్పింది. పంచాయతీలకు కేటా యించిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. గ్రామాల్లో శుభ్రత నిర్వహణ, నీటి సరఫరా, వీధి దీపాల సంరక్షణ వంటి బాధ్యతలు నిర్వహించే కార్మికులు ఒకేసారి మూడు నెలల వేతనాలు అందనున్నాయి.
జిల్లాలో 1,520 మంది కార్మికులు..
జిల్లాలో 19 మండలాల పరిధిలోని 400 గ్రామ పంచాయతీ ఉన్నాయి. వీటిలో సుమారు 1,520 మంది కార్మికులున్నారు. వీరికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు.


