అంగట్లో అడవి బిడ్డలు! | - | Sakshi
Sakshi News home page

అంగట్లో అడవి బిడ్డలు!

Mar 21 2026 5:24 AM | Updated on Mar 21 2026 5:24 AM

● 2019లో ఆసిఫాబాద్‌ ఓ పోలీసు కానిస్టేబుల్‌ సహా మరో నలుగురు మధ్యవర్తులు కలిసి ఓ గిరిజన మహిళను మధ్యప్రదేశ్‌లోని జర్వాకు ఉద్యోగం పేరుతో పంపి, అక్కడ లాలాగిరి గోసామితో పెళ్లి చేశారు. రూ.1.30లక్షలకు తనను అమ్మేశారని తెలుసుకుని అక్కడి నుంచి బాధిత మహిళ తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కానిస్టేబుల్‌ విధుల నుంచి డిస్మస్‌ కాగా, నిందితులకు శిక్ష పడింది. ● గతంలోనూ ఆసిఫాబాద్‌ జిల్లాలో గిరిజన మహిళలను పెళ్లి, ఉద్యోగం పేరుతో అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆదివాసీ హక్కుల న్యాయ కేంద్రం(ఐఆర్‌ఏసీ) గిరిజన మహిళలు మధ్యవర్తుల ద్వారా వేర్వేరు రాష్ట్రాలకు తరలించారనే ఆరోపణలతో ఎన్‌హెచ్‌ఆర్సీ సంప్రదించగా, అప్పటి జిల్లా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ● తాజాగా బెజ్జూరు మండలంలో ఇద్దరు మహిళలను పని కల్పిస్తామని మధ్యప్రదేశ్‌కు అక్రమంగా తరలించి, అక్కడ ఇద్దరు వ్యక్తులతో పెళ్లి చేశారు. తమ కూతుళ్లు కనిపించడం లేదనే ఫిర్యాదుతో స్థానిక పోలీసులు దర్యాప్తు చేయగా, మధ్యప్రదేశ్‌కు ఒక్కొక్కరిని రూ.2.50లక్షల చొప్పున అమ్మేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాధిత మహిళలను అక్కడి నుంచి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది.

గిరిజనుల పేదరికానికి డబ్బులతో వల పని, పెళ్లిళ్ల పేరుతో మహిళల తరలింపు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దళారుల దందా

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పేదరికం, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అడవి బిడ్డలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా ఉన్నా పెళ్లి కాని యువకుల కోసం ఇక్కడి అమ్మాయిలను తరలిస్తున్నారు. ఈ దందాలో మధ్యవర్తులు కీలకంగా మారుతున్నారు. రెండు రోజుల క్రితం బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను పని కల్పిస్తామని మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి తరలించి పెళ్లి చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇతర రాష్ట్రాలే కాకుండా హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన పలు సామాజిక వర్గాల వారు సైతం గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ల పేరుతో డబ్బులు పోసి కొనుక్కుంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులకు ఎంతో కొంత ఎదురిస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పెళ్లిళ్లు జరిగాక ఆ కుటుంబాల్లో పరిస్థితులకు తట్టుకోలేక తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది.

పేదరికమే శాపం

నిరుపేద గిరిజన కుటుంబాల్లో అమ్మాయిలు చాలా వరకు పది, ఇంటర్‌ వరకు చదివి ఆపేస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఉన్న వారు, విడాకులు పొందిన, భర్త చనిపోయిన వారిని పెళ్లిళ్ల కోసం మధ్యవర్తులు అమ్మాయిల తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నారు. పెళ్లి ఖర్చులతో సహా కుటుంబీకులకు డబ్బులు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో గత కొన్నేళ్లుగా మహిళలు మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి ప్రాంతాలకు ఇక్కడి మహిళలతో పెళ్లిళ్లు జరిగాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల ఇష్టంతోనే జరుగుతున్నాయి. గోండి భాషతో సహా మరాఠీ, హిందీ భాషలు మాట్లాడడం సులువు కావడంతో గిరిజన మహిళలను ఉత్తరాదికి పంపుతున్నారు. ఇందులో గ్రామంలో ఉన్న మధ్యవర్తులు, పలు రాష్ట్రాల్లోని మధ్యవర్తులు వ్యవహారమంతా నడుపుతున్నారు. ఇవి కొన్నిసార్లు మాత్రమే బయటపడుతున్నాయి.

పెళ్లిళ్లు, పని కల్పన పేరుతో

గతేడాది మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ, స్థానిక మధ్యవరులు కలిసి ఆసిఫాబాద్‌కు చెందిన ఓ యువతిని మధ్యప్రదేశ్‌కు పెళ్లి పేరుతో విక్రయించారు. అక్కడ వారి బారి నుంచి తప్పించుకుని బయటపడి ఫిర్యాదు చేయడంతో 9మందిపై కేసు నమోదైంది.

దర్యాప్తు జరుగుతోంది

మహిళల అక్రమ రవాణా కేసుపై విచారణ జరుగుతోంది. బాధిత మహిళలను సురక్షితంగా తీసుకొచ్చాం. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తాం.

–నితిక పంత్‌, జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement