నిర్మల్ టౌన్: రంజాన్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వారికి ముందస్తు శు భాకాంక్షలు తెలిపారు. 30రోజులు నమాజ్, ఉపవాస దీక్షలు చేసుకుంటూ విధులు నిర్వహించిన ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అదనపు ఎస్పీ సాయికిరణ్, ఏవో యూనస్ అలీ, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
పటిష్ట పోలీస్ బందోబస్తు
రంజాన్ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాంలో గల ఈద్గా మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రార్థనలు చేయడానికి ఈద్గా వద్దకు ముస్లింలు అధికసంఖ్యలో వచ్చే అవకాశముందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యం, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
భైంసా పట్టణంలో..
భైంసాటౌన్: పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. సుద్దవాగు ప్రాజెక్ట్ సమీపంలోగల ఈద్గాను సందర్శించి ఏర్పాట్లు, బందోబస్తును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట ఏఎస్పీ సాయికిరణ్, సీఐలు ప్రవీణ్, సాయికుమార్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు ఉన్నారు.


