శభాష్‌.. ముదిగుంట | - | Sakshi
Sakshi News home page

శభాష్‌.. ముదిగుంట

Mar 30 2026 7:25 AM | Updated on Mar 30 2026 7:25 AM

జలసంరక్షణకు ప్రత్యేక చర్యలు ఇంటింటా ఇంకుడుగుంతలు అటవీ ప్రాంతాల్లో నీటికుంటలు ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ ప్రశంస గ్రామానికి అరుదైన గుర్తింపు

జైపూర్‌: మండలంలోని ముదిగుంట గ్రామానికి అరుదైన గుర్తింపు దక్కింది. ఆదివారం నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తంజేస్తున్నారు. ఈ గ్రామాన్ని ప్రధాని ప్రశంసించడం వెనుక గ్రామస్తుల కృషి ఎంతో ఉంది. జల సంరక్షణకు గ్రామస్తులు చేపట్టిన చర్యలే ఇందుకు కారణం. అధికారుల సూచనలతో గ్రామస్తులంతా ఇంటింటా ఇంకుడుగుంతలు, అటవీప్రాంతాల్లో 10 నీటి కుంటలు నిర్మించుకున్నారు. ఫలితంగా భూగర్భజలాలు పెరిగాయి. మండు వేసవిలోనూ నీటి కుంటల్లో నీరుండడంతో పశువులు, వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుంటున్నాయి.

మారుమూల గ్రామమైనప్పటికీ..

మంచిర్యాల–చెన్నూర్‌ 63వ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ మారుమూల గ్రామంలో జీవనం సాగించేవారిలో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేట్‌ ఉద్యోగులున్నారు. గ్రామంలో 1,500మంది జనాభా ఉండగా 400ఇళ్లున్నాయి. ఇందులో 380 ఇళ్లల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల వద్ద కూడా ఇంకుడుగుంతలు నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామంలో రూప్‌ టాప్‌ రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌తో పాటు కమ్యూనిటీ సోప్‌పీట్స్‌ ద్వారా బోర్‌వెల్‌ రీచార్జ్‌ స్ట్రక్చర్‌ చేస్తూ సఫలీకృతులయ్యారు. దీంతో దక్షణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ముదిగుంట గ్రామాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్‌ తరాలకు జలాన్ని అందించడానికి జలసంరక్షణ చర్యలు చేపట్టడాన్ని అభినందించారు. ముదిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తంజేస్తున్నారు. కాగా, ఇప్పటికే మంచిర్యాల జిల్లాకు కేంద్ర జలశక్తి అవార్డు లభించగా రూ.కోటి ప్రోత్సాహం అందుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement