భగ్గుమంటున్న భానుడు | - | Sakshi
Sakshi News home page

భగ్గుమంటున్న భానుడు

Mar 30 2026 7:25 AM | Updated on Mar 30 2026 7:25 AM

ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అత్యవసరమైతేనే బయటకు.. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల నమోదు

ఆదిలాబాద్‌టౌన్‌: భానుడు భగ్గుమంటున్నాడు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఎండతీవ్రత పెరిగిపోతోంది. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసమైతేనే బయటకు వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండతీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్న సమయంలో ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిర్మల్‌ జిల్లా తానూరు, కడెం, భైంసా, ఖానాపూర్‌, సారంగాపూర్‌, మంచిర్యాల జిల్లా కాసిపేట, భీమారం, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు జైనథ్‌, బేలలో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

నిర్మానుష్యంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌

ఇళ్లకే పరిమితం..

రాబోయే వారం రోజుల్లో జిల్లాలో ఎండలు అధికంగా నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు వడగాలులు వీచనున్నాయని పేర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురవ్వడం, డీహైడ్రేషన్‌తో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్‌ రావడం తదితర లక్షణాలు బయటపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా, చిన్నారులు, వృద్దులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

ఎండవేడిమిని తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. వ్యాపారులు, ఇతర పనులకు వెళ్లేవారు శీతలపానీయాలు, కొబ్బరిబొండా, నిమ్మకాయ సోడా తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వర్షాకాలంలో అధిక వానలు కురిస్తే, చలికాలంలో రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. జిల్లావాసులు మూడు కాలాల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రస్తుతం వేసవి వేడి భరించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement