‘మహా’ అక్రమదందాలు ఆగేనా..? | - | Sakshi
Sakshi News home page

‘మహా’ అక్రమదందాలు ఆగేనా..?

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

● చెక్‌పోస్టులు ఉన్నా యథేచ్ఛగా ఇసుక రవాణా ● ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కనే డంపులు ● కీలక సూత్రధారి అరెస్ట్‌

చెక్‌పోస్టులు ఉన్నా యథేచ్ఛగా ఇసుక రవాణా ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కనే డంపులు కీలక సూత్రధారి అరెస్ట్‌

భైంసాటౌన్‌: జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర కేంద్రంగా జిల్లాలో అక్రమదందాలు జోరుగా సాగుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాతోపాటు ఇసుక, గుట్కా దందాలు సైతం నడుస్తున్నాయి. ధర్మాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పలువురితో ముఠాగా ఏర్పడి పీడీఎస్‌ బియ్యం అక్రమ దందాతోపాటు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇదివరకే పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యాడు. అయినా, పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా, ఇసుక అక్రమ రవాణా కేసులోనూ పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. దీంతో జిల్లాలో ఇకనైనా ఇసుక అక్రమదందాకు అడ్డుకట్ట పడుతుందా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

యథేచ్ఛగా రవాణా...

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసు శాఖకు సవాల్‌గా ఇసుక అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దు మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ఇసుక అక్రమంగా తరలుతోంది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఇటీవల సారంగాపూర్‌, బిద్రెల్లి వద్ద పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల్లో ఇసుక అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని ప్రకటించారు. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఇటీవల బిద్రెల్లి వద్ద రెండు ఇసుక టిప్పర్లు, తాజాగా ఆదివారం బాసరలో మూడు వాహనాలు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. ఇక, పీడీఎస్‌ బియ్యం అక్రమదందా సైతం ఆగడం లేదు. మరోవైపు మహారాష్ట్ర నుంచి గుట్కా ఉత్పత్తులు కూడా అక్రమంగా రవాణ అవుతున్నాయి. వీటిపై సైతం అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

డంపులపై చర్యలేవి..?

మహారాష్ట్ర నుంచే కాకుండా జిల్లాలోని వాగుల నుంచి సైతం ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. వాగుల నుంచి ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ ఖాళీ ప్రదేశాల్లో డంప్‌ చేస్తున్నారు. భైంసా పట్టణంలో మూతపడిన పలు జిన్నింగ్‌ మిల్లుల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేస్తున్నారు. భైంసా పట్టణంలో బాసర మార్గంలో, కుభీర్‌ చౌరస్తా ప్రాంతంలో ఇసుక కుప్పలు రోడ్డు పక్కనే పెట్టి విక్రయిస్తున్నారు. ఇకనైనా పోలీసు యంత్రాంగం ఇసుక, మొరం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement